తాజా వార్తలు : మెట్రోరైలు విజయవాడ వరకే, గుంటూరుకు కష్టమే శ్రీధరన్
హైదరాబాద్ష్ : విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి ప్రాంతాల్లో కేంద్రం చేపట్టదలచిన మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ మెట్రో ప్రధాన సలహాదారునిగా తాజాగా నియమితులైన శ్రీధరన్ శనివారం విజయవాడ, మంగళగిరి పరిసరాల్లో ఉడా, ఇతర శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
తొలిదశగా రెండు కారిడార్లుగా మొత్తం 26 కిలో మీటర్ల మేర రెండు మార్గాల్లో మెట్రో రైలు మార్గాలు ఏర్పాటు చేయాలనే నిశ్చయంతో ఉన్నామన్నారు. ఇందుకు కిలోమీటరుకు 200 కోట్లు చొప్పున కనీసం రూ.7,500 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్టు చెప్పారు.
ఇందుకోసం మౌలిక సదుపాయాలు, భూమి, ఇతర అంశాలతో ఒక నివేదిక తయారు చేసి ఉంటుందన్నారు. ఒక మార్గంలో సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బెంజిసర్కిల్ మీదుగా పండిట్ నెహ్రూ బస్టేషన్ వరకు 13 కిలో మీటర్ల మేర, రెండో మార్గంలో బస్టేషన్ నుంచి రైల్వేస్టేషన్ మీదుగా రామవరప్పాడు రింగ్‌రోడ్డు మార్గంలో ఐదు కిలోమీటర్ల మేర మార్గాన్ని నిర్మించదలచామని తెలిపారు.
అధికారులు పంపిన నివేదికను పరిశీలించిన అనంతరం మంత్రివర్గ ఆమోదం తదుపరి టెండర్లు ఖరారు చేసినప్పటి నుంచి మూడేళ్లలో మెట్రో రైలుమార్గం నగర ప్రజలకు అందుబాటులోకి రాగలదన్నారు. రాజధానిలో నిర్మించ తలపెట్టిన మెట్రో రైలు ప్రస్తుతానికి విజయవాడ నగరానికే పరిమితమని శ్రీధరన్ తెలిపారు.
మెట్రో నిర్మాణం చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారమని, గుంటూరు తదితర ప్రాంతాలకు విస్తరించడం ప్రస్తుతం కష్టమని తెలిపారు. విజయవాడ నగరంలో చేపట్టే మొదటి దశకు సంబంధించి రెండు మార్గాలను గుర్తించామని, అన్నీ సవ్యంగా సాగితే నాలుగేళ్లలో పూర్తవుతుందన్నారు. రెండో దశలో మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశముందన్నారు.
No Comment to " తాజా వార్తలు : మెట్రోరైలు విజయవాడ వరకే, గుంటూరుకు కష్టమే శ్రీధరన్ "